కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) ద్వారా 12 టీఎంసీల నీటిని తీసుకు వెళ్తున్నా.. జిల్లాకు చెందిన మంత్రులు స్పందించకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ధ్వజమెత్తారు. సోమవారం మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ (Palamuru – Rangareddy Project) పరిధిలో పూర్తయిన రిజర్వాయర్లు దింపకపోవడం వల్లే అక్రమంగా ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని తరలించకపోతుందని ఆయన అన్నారు. రైతుల గోస చూసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా మరో పోరాటానికి సిద్ధం అవుతున్నారని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో పంట పొలాలు ఎండి పోయి రైతాంగం దీనావస్థలో ఉందన్నారు.
రైతుబంధు లేదు, బోనస్ లేదు, రుణమాఫీ లేదనీ, రైతులు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజావాణిలో ప్రజలు స్వేచ్ఛగా వెళ్లి తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు. పోలీస్ అధికారులు ఆంక్షలు పెట్టడం సరికాదని హితవు పలికారు.
రైతులందరికీ ప్రతి పంటకు రైతు భరోసా, కొరత లేకుండా ఎరువుల పంపిణీ, పంటలకు బోనస్, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనీ శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, కార్పోరేటర్లు ఈశ్వరయ్య, నవకాంత్, శరత్, సత్యం మధుమోహన్, సీనియర్ నాయకులు శ్రీను నాయక్, నరేందర్, కుర్వ శ్రీశైలం, నరేష్, జహంగీర్, క్రాంతి, కట్ట రవికిషన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సుధాకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్
Follow Us On: X(Twitter)

