కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎదుట పోలీసులు తమను అడ్డుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ హైకోర్టు (TG High Court) ను ఆశ్రయించారు. అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ్యులు నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించినా వారిపై పోలీసులు చర్యలు తీసుకోవద్దని, అలాంటి అంశాలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అసెంబ్లీకి వెళ్లే సమయంలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కూడా హైకోర్టు స్పందించింది. ఘటనలో పాలుపంచుకున్న పోలీసు అధికారులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళా నేతలపై దాడికి పాల్పడినట్లు తేలితే ఆ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై హోంశాఖ జీపీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన కోర్టు (TG High Court) తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

