కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao)ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా, రాంచందర్ రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను బలవంతంగా ఎత్తుకెళ్లి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలువురు మహిళా కార్యకర్తలు సైతం అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
ఇది నాలుగోసారి..
ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విడుదల కోసం డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. సుమారు 600 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారన్నారు. గత పది రోజుల్లో తనను అరెస్ట్ చేయడం ఇది నాలుగో సారి అన్నారు. దీన్ని బట్టి రేవంత్ ప్రభుత్వం విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వమని తేలిపోయిందన్నారు. బీజేపీ ఎలాంటి ధర్నా చేపట్టినా.. ప్రభుత్వం ముందుగానే అడ్డుకుంటోందన్నారు. అసెంబ్లీ లోపల, బయట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు.

