కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)నగరంలో విద్యార్థులకు తైక్వాండోలో (Taekwondo) మెరుగైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఛాంపియన్స్ తైక్వాండో అకాడమీ (Champions Taekwondo Academy) ప్రారంభమైంది. ముబారక్ నగర్‌లోని విజయ హైస్కూల్ (Vijaya High School) సమీపంలో ఏర్పాటు చేసిన అకాడమీని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి (DYSA) పవన్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. తైక్వాండో కేవలం క్రీడ మాత్రమే కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులకు ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పించడంతో పాటు క్రీడా పోటీల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, కోచ్ గంగాధర్, నాగరాజ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేసే విధంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా తైక్వాండో అసోసియేషన్‌కు(Taekwondo Association) సంబంధించిన గుర్తింపు, సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు సూచించారు. తమ అసోసియేషన్‌కు సంబంధించిన సర్టిఫికెట్లే విద్యార్థులకు అధికారికంగా ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. ఇతర సంస్థల పేరుతో ఇచ్చే సర్టిఫికెట్ల విషయంలో ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అయితే వివిధ తైక్వాండో సంస్థల గుర్తింపు, సర్టిఫికెట్ల చెల్లుబాటుకు సంబంధించిన విషయాలను సంబంధిత అధికారిక క్రీడా సంస్థల వద్ద ధృవీకరించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కొత్తగా అకాడమీ అందుబాటులోకి రావడంతో నిజామాబాద్ నగరంలోని తైక్వాండోపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ పొందేందుకు మరొక వేదిక ఏర్పడింది. చిన్నారులు క్రీడల్లో రాణించడంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా నిర్వాహకులు ఆకాంక్షించారు.

