బీఆర్ఎస్ సమరభేరి.. కరీంనగర్‌లో హోరెత్తిన నిరసన గళం

కలం, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏడవ రోజు నగరంలో ఉద్రిక్త వాతావరణం మధ్య నిరసన కార్యక్రమాలు (BRS Protest) హోరెత్తాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డాయి.

అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది..

నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలకుల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా చల్లా హరిశంకర్ మాట్లాడుతూ.. నగరంలో పాలనా యంత్రాంగం పూర్తిగా నిరుత్సాహపడిందని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు.

అంధకారంలో ప్రజలు..

నగరంలో ఎక్కడికక్కడ వీధి దీపాలు వెలగక ప్రజలు అంధకారంలో ఇబ్బంది పడుతున్నారని, శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా అటకెక్కి చెత్తాచెదారం పేరుకుపోయిందని ఆరోపించారు. ప్రతిరోజూ సాగాల్సిన నీటి సరఫరా బంద్ అయిందని, మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అటు నగరపాలక సంస్థలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఇరు పార్టీలు కలిసి కరీంనగర్ నగర అభివృద్ధిని పూర్తిగా బ్రష్టు పట్టించాయని విమర్శించారు.

పేరు వస్తుందనే దురుద్దేశంతోనే..

గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, ఈ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో గానీ, నగరపాలక సంస్థలో బీజేపీ ఏడు నెలల పాలనలో గానీ కరీంనగర్‌కు ఒరిగిందేమీ లేదని, అభివృద్ధి కేవలం శూన్యమని హరిశంకర్ స్పష్టం చేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్పొరేటర్లకు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే పాలకులు నగర ప్రజలను కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ప్రజలు నమ్మకం కోల్పోయారు..

ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ నాయకులపై పూర్తిగా నమ్మకం కోల్పోయారని, సమస్యలు వస్తే ఆ రెండు పార్టీల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లడం మానేశారని చెప్పారు. ఏకైక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ సమస్యల కోసం నేరుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు టిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకుల వద్దకే వస్తున్నారని, ప్రజలకు అండగా ఎప్పుడూ గులాబీ శ్రేణులు వెంటే ఉంటాయని భరోసానిచ్చారు. నిరసన తదనంతరం నగరపాలక సంస్థ ప్రజావాణిలో 66 డివిజన్లకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రాలు సమర్పించినారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణ రావు గారు మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గారు, బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు డివిజన్ ఇన్చార్జులు నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>