కలం, నిజామాబాద్ బ్యూరో: దళిత స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) చేసిన అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, శాసన వ్యవస్థ గౌరవానికి విరుద్ధమని ఆయన అన్నారు. శాసనసభ స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన, అవమానకర వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ తాతా మధు తన వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాతా మధుపై చర్యలు తీసుకోవాలి
శాసన మండలి నిబంధనల ప్రకారం తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. అవసరమైతే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉన్నప్పటికీ.. వ్యక్తిగత అవమానాలు, కుల వివక్షకు మాత్రం తావు ఉండకూడదని అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతను గుర్తించి సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
కేసీఆర్ స్పందించాలి
ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై స్పందించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు దళిత సమాజానికి, స్పీకర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. శాసన వ్యవస్థ ప్రతిష్ట, గౌరవాన్ని కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ప్రజాస్వామ్య సంస్థల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలకు రాజకీయాలకు అతీతంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.

