కలం, జగిత్యాల: జగిత్యాల పట్టణాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే(Jagtial MLA) డా. సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వన మహోత్సవం (Vanamahotsavam) సందర్భంగా జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో 14వ వార్డులో నిర్వహించిన ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు.
మొక్కల పెంపకంతో పట్టణంలో పచ్చదనం పెరగడంతో పాటు కాలుష్యం తగ్గుతుందని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, నీడ అందుతుందని తెలిపారు. అనంతరం ఫిల్టర్ బెడ్ వద్ద రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రీన్ షెడ్‌కు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అలాగే 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పలు ప్రాంతాల్లో భారీ సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
ధర్మసముద్రం వద్ద 15 లక్షల లీటర్ల సామర్థ్యంతో, కొత్త బస్టాండ్, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల, సరస్వతిగుట్ట ప్రాంతాల్లో 16 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల పట్టణానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో దళితులు, బీసీలు, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

