కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ వచ్చిన తనకు ఒక్క పోటుతో పదవి నుంచి తొలగించారని చిన్నా రెడ్డి (Chinna Reddy) వాపోవడం కార్యకర్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శ్రేణులు అభిమానంగా చిన్నన్న అని పిలుచుకునే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో మేఘారెడ్డి పైచేయి సాధించారని విశ్లేషిస్తున్నారు.
మేఘారెడ్డి ఫిర్యాదుతో..
చిన్నారెడ్డిపై వేటు పడటానికి ప్రధానంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఫిర్యాదు, ఇరువురి మధ్య ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది. చిన్నారెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులతో మరీ ముఖ్యంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో సన్నిహితంగా మెలుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆధారాలను, ఆడియో రికార్డులను కూడా మేఘారెడ్డి హైకమాండ్‌కు సమర్పించినట్లు సమాచారం.
‘ఒక్క పోటుతో..’ అంటూ!
పదవి నుంచి తొలగించిన తర్వాత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఆవేదనను స్పష్టంగా చూపించాయి. “ఇందిరా గాంధీ పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నాను. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. కానీ, ఒక్క పోటుతో (ఒకే ఉత్తర్వుతో) నన్ను కూల్చేశారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, పదవి ఉన్నా లేకపోయినా తన గౌరవం తనకు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి కోసం తాను ఎప్పుడూ సీఎం రేవంత్ రెడ్డిని అడగలేదని వెల్లడించారు.
ఎన్నెన్నో పదవులు..
నాలుగున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న చిన్నారెడ్డికి ఇటీవలి పరిణామాలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. రాజకీయ జీవితం పూర్తిగా కాంగ్రెస్‌తోనే ముడిపడి ఉంది. 1980 నుంచే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. 1980 సెప్టెంబర్ నుంచి 1983 ఫిబ్రవరి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా (1989, 1999, 2004, 2014) గెలుపొందారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా (2007-2009) పని చేశారు.
సొంత పార్టీలోనే ఇబ్బందులు..
ఇటీవల ఆయన్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయనకు తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. సొంత పార్టీలోనే తనకు సరైన గౌరవం దక్కలేదని, జూనియర్లు, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని చిన్నారెడ్డి వాపోయారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో ఉన్న విభేదాల కారణంగా, సొంత నియోజకవర్గంలోనే ఆయనకు ఎదురీత తప్పడం లేదు. ‘కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా ఇన్నాళ్లు పనిచేశాను. కానీ ఇప్పుడు జరిగిన తీరు బాధాకరం’ అంటూ విచారం వ్యక్తం చేశారు. జీవిత కాలం పార్టీనే నమ్ముకున్న సీనియర్ నేతకు రాజకీయ కారణాలతో ఇలా జరగడం ఆయన వర్గీయులను కుంగదీసింది.

