కలం, నాగర్ కర్నూల్: ఈ నెల 12న నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు (Nagarkurnool Court)లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబోతున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, డీఎల్ఎస్ఏ ఛైర్మన్ డి.రమాకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. వివాదాలు, కోర్టు కేసుల పరిష్కారంలో రాజీ మార్గమే రాజమార్గం అన్నారు. జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ తగాదా, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలు, మోటార్ వాహన ప్రమాద కేసులకు అదాలత్‌లో పరిష్కారం లభిస్తుందన్నారు.
త్వరగా కేసుల పరిష్కారం..
బ్యాంకు కేసులు, ఇతర పెండింగ్ కేసులను కూడా రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని డి.రమాకాంత్ వెల్లడించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్‌కు అవకాశం లేని తీర్పు పొందవచ్చని అన్నారు. ఇరువర్గాలు రాజీ చేసుకోవడం ద్వారా కక్షలు, ప్రతీకారాలు తగ్గి మానవ సంబంధాలు బలపడతాయని తెలిపారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సెషన్స్ జడ్జి నసీం సుల్తానా, డీఎల్ఎస్ఏ సెక్రటరీ నిహారిక, సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగశ్రావ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శృతి దూత పాల్గొన్నారు.

