కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట అందోల్ సర్వే నంబర్ 1141 భూ బాధితులు ధర్నా చేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో మంజూరైన భూ పట్టాలను సెక్షన్ 22 ఏ ప్రొహిబిషన్ లిస్ట్ నిషేధిత జాబితా (Section 22A)లో చేర్చడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని, రైతు బంధుతో పాటు అన్ని ప్రభుత్వ ప్రోత్సాహకాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న హయాంలో పేదలకు కేటాయించిన భూములను నమ్ముకుని తాము ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నామని బాధితులు తెలిపారు. అయితే 2018లో కొత్త పాస్ పుస్తకాల జారీ సమయంలో కొందరికి మాత్రమే పుస్తకాలు అందాయని, అందోల్ సర్వే నంబర్ 1141 కి చెందిన 36 మందికి మాత్రం ఇప్పటికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదని వారు వాపోయారు.
న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో వారు ప్రభుత్వ వ్యవస్థ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో ఇచ్చిన పట్టాలను ప్రొహిబిషన్ లిస్ట్ నుంచి తొలగించి, న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

