కలం, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భారత్‌తో కీలక పోరుకు ముందు పాకిస్థాన్ ఓపెనర్ ఆయేషా జఫర్ (Ayesha Zafar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌పై ప్రత్యేక ఒత్తిడి పెట్టుకోవడం లేదని ఆమె స్పష్టం చేసింది. టోర్నీలో ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నామని తెలిపింది. థాయ్‌లాండ్‌పై భారీ విజయం సాధించిన పాకిస్థాన్ మంచి ఊపులో ఉంది. అదే జోరును భారత్‌పైనా కొనసాగించాలని ఆ జట్టు భావిస్తోంది. భారత్‌పై మంచి ప్రదర్శన చేసి విజయం సాధించడమే తమ లక్ష్యమని ఆయేషా తెలిపింది.
విమెన్స్ ఆసియా కప్‌లో భారత్ ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. థాయ్‌లాండ్, హాంకాంగ్‌పై భారత్ వరుస విజయాలు సాధించింది. ప్రస్తుతం గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు పాకిస్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో ఒక్క మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది. అందుకే భారత్‌తో మ్యాచ్ కీలకంగా మారింది. అయినా ఈ పోరును ప్రత్యేకంగా చూడటం లేదని ఆయేషా చెప్పింది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే సహజంగానే భారీ ఆసక్తి ఉంటుంది. రెండు జట్లపై కూడా ఒత్తిడి ఉంటుంది. కానీ తమ దృష్టి మాత్రం ఆటపైనే ఉందని పాక్ ఓపెనర్ (Ayesha Zafar) తెలిపింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పైనా పాకిస్థాన్ ప్రత్యేకంగా పనిచేస్తోందని ఆయేషా వెల్లడించింది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో ఎలాంటి రాజీ పడకూడదని తమ మెంటర్ సూచించినట్లు తెలిపింది. ఫీల్డింగ్‌తో కూడా మ్యాచ్‌లను గెలవొచ్చనే విషయాన్ని జట్టు నమ్ముతోందని చెప్పింది.
మరోవైపు భారత్ కూడా పాకిస్థాన్‌పై ఆధిక్యంతో బరిలోకి దిగుతోంది. ఇటీవలి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై భారత్ ఒక అడుగు ముందే ఉందని దీప్తి శర్మ తెలిపింది. ఆసియా కప్‌లో అయినా, ఇతర మ్యాచ్‌ల్లో అయినా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాలు తమకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని దీప్తి పేర్కొంది. అదే జోరును కొనసాగించాలని భారత్ భావిస్తోంది. ఇలా ఒకవైపు భారత్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరగా.. మరోవైపు పాకిస్థాన్‌కు తదుపరి దశకు వెళ్లేందుకు విజయంపై గురి ఉంది. దీంతో రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

