ఏఐ యుగంలో ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి: భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : ప్రస్తుత కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వందేమాతరం, తెలంగాణ రాష్ట్ర గీతాలను ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలను చదివి పరీక్షల్లో మార్కులు సాధించడానికే పరిమితం కాకుండా, తాము నేర్చుకున్న విషయాలను వాస్తవ జీవితంలో అన్వయించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థల అభివృద్ధికి నైపుణ్యం కలిగిన మానవ వనరులే ప్రధాన కారణమని, అలాంటి నైపుణ్యాలకు పునాది వేసేది ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వమేనని పేర్కొన్నారు.

విద్యార్థుల్లో పఠన అలవాటును పెంపొందించాలని సూచించారు. వివిధ అంశాలు, సబ్జెక్టులపై ఆసక్తి పెరిగేలా పుస్తకాలు, విజ్ఞాన వనరులను చదివేలా వారిని ప్రోత్సహించాలన్నారు. సమాజంపై అవగాహన, శోధనాత్మక దృక్పథం, అభ్యసన సామర్థ్యం, ఆచరణాత్మక ఆలోచనలను విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన సాగాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఈ ఏడాది గణనీయంగా విద్యార్థుల నమోదు పెరగడం, పరీక్ష ఫలితాల్లో మంచి పురోగతి సాధించడం అభినందనీయమని అన్నారు.

అనంతరం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపి వారికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న, ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి పరశురామ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>