కలం, యాదగిరిగుట్ట: ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం సంఘాలకు అతీతంగా ప్రతి ఉద్యోగి ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మందడి ఉపేందర్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “చలో హైదరాబాద్–ఉద్యోగుల హక్కుల సాధన సభ”ను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలంలో ప్రచార కార్యక్రమం నిర్వహించి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ (TGEJAC) నిరంతరం పోరాడుతోందన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించడం, 2వ పీఆర్సీని అమలు చేయడం, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించడం, ఈహెచ్‌ఎస్‌లో క్యాష్‌లెస్ వైద్యం అందించడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, జీవో 317 బాధితులకు న్యాయం చేయడం వంటి ప్రధాన డిమాండ్లపై ఉద్యమం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. “మనం అడిగేవి కానుకలు కావు.. మనకు రావాల్సిన న్యాయమైన హక్కులు. సంఘాలు వేరైనా సమస్యలు ఒక్కటే. హక్కుల సాధనకు ఉద్యోగుల ఐక్యతే మన బలం” అని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో జరిగే చలో హైదరాబాద్ సభకు యాదగిరిగుట్ట మండలంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉద్యోగుల ఐక్యతను చాటాలని మందడి ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TRESA జిల్లా కార్యదర్శి ఆర్. శ్రీకాంత్, TNGO జిల్లా కోశాధికారి కె. శ్రీకాంత్, జిల్లా కో-చైర్మన్ పెండెం శ్రీనివాస్, రామ్మోహన్ రావు, పీఆర్‌టీయూ నాయకులు గడ్డమిడి పాండు, కోల ఆంజనేయులు, మల్లేశం, కైరంకుండ అనిల్, ఆకునూరి నర్సింహా, టీజీఈజేఏసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ గణగాని శశికాంత్ గౌడ్, ఆలేరు యూనిట్ అధ్యక్షులు పోలా గురునాథ్, TNGO నాయకులు నల్లవెల్లి సునీల్ కుమార్, కేంసారం ఆనంద్, టీజీఈజేఏసీ నాయకులు బిళ్ల నాగసైదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా “సంఘాలు వేరైనా.. సమస్యలు మనందరివే.. హక్కుల సాధనకు ఐక్యతే మన బలం” అంటూ నాయకులు నినాదాలు చేశారు. సెప్టెంబర్ 10న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

