కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని హంగులతో కూడిన అత్యుత్తమ విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (MVS Degree College) నూతన భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది శాస్త్రవేత్తలు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులను అందించిన ఘనత ఎంవీఎస్ కళాశాలకు ఉందన్నారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ కళాశాలను సుమారు రూ. 70 కోట్లతో సమగ్ర ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని, అందులో భాగంగా తొలి విడతగా రూ.20.50 కోట్లతో నేడు శంకుస్థాపన, భూమిపూజ చేస్తున్నట్లు తెలిపారు.
మిగిలిన రూ.50 కోట్లను కూడా దశలవారీగా సమకూర్చి కళాశాలను తెలంగాణలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం కళాశాలలో సుమారు 3 వేల 5 వందల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బ్యాంకింగ్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, సివిల్ సర్వీసెస్ తదితర ఉద్యోగ, పోటీ పరీక్షలకు ఉపయోగపడే కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
అదేవిధంగా బాలికల కోసం హాస్టల్ నిర్మాణం, కళాశాల, గ్రౌండ్ అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు. ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో రూ. 15 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారుల నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థుల వరకు వేలాది మందికి నాణ్యమైన విద్య అందించేలా మొత్తం ఎంవీఎస్ ప్రాంగణాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో అత్యాధునిక మౌలిక వసతులతో అద్భుతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మీడియా కన్వీనర్ సీజె బెనహర్, కార్పొరేటర్లు గుముడాల రాధ గోవర్థన్ గౌడ్, రమేష్ బాబు, కిషన్ నాయక్, రమేష్ రెడ్డి, ఫకృ, ఎస్ శేఖర్, మేగ్యా నాయక్, తాహేర్, విట్టల్ రెడ్డి, అనుప ఆంజనేయులు, భాను చందర్, సోషల్ మీడియా ఇంచార్జీ ఏర్పుల నాగరాజు, నాయకులు మైత్రి యాదయ్య, వాల్దాస్ ప్రతాప్ గౌడ్, చంద్రమౌళి, అబ్దుల్ హక్, నరేష్, మోయీజ్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, ఈఈ కె.రాంచంద్రం, డీఈఈ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

