కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనానికి స్వల్ప ప్రమాదం (KTR Car Accident) జరిగింది. జిల్లాలోని అలుగునూర్ వద్ద కేటీఆర్ కారును ఒక లారీ ఢీకొట్టింది.
కరీంనగర్లో నిర్వహించనున్న యువ సమరభేరి సభకు హాజరయ్యేందుకు కేటీఆర్ ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్‌ను పలకరించేందుకు కారును ఆపారు. ఆ సమయంలో కేటీఆర్‌తో పాటు ఇతరులు కారు వెనుక డోర్ తెరిచారు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక లారీ తెరిచి ఉన్న కారు డోర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో కేటీఆర్ కారులోనే ఉన్నారు. లారీ ఢీకొనడంతో కారు వెనుక భాగం, డోర్ స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి మేజర్ ప్రమాదం జరగకపోవడంతో కేటీఆర్‌తో పాటు కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు.

