కలం, వెబ్‌డెస్క్: ఇటీవల గోదావరిలో ఓ భార్యా భర్తల ఆత్మహత్య మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జి (Chinchinada Bridge)పై నుండి మరో కుటుంబం నదిలోకి దూకేసింది. దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి నదిలోకి దూకగా మహిళను స్థానికులు రక్షించారు. కాగా, పిల్లలు, భర్త వరదలో గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. నంబూరి శ్రీనివాస్ తన భార్య పద్మిని, పిల్లలు ఈశ్వర్, నిత్యలతో కలిసి శనివారం ఉదయం చించినాడ బ్రిడ్జి వద్దకు వచ్చాడు. భార్యభర్తలు తమ బైక్‌లను బ్రిడ్జి పక్కన పార్క్ చేసి నదిలోకి దూకేశారు. స్థానిక జాలర్లు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. పద్మినిని రక్షించగా, మిగతా ముగ్గురు వరదలో కొట్టుకుపోయారు. అనంతరం ఆమెను తణుకు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉందని డాక్టర్లు తెలిపారు. ఆర్థిక సమస్యలే వీరి ఆత్మహత్య యత్నానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

