ఫీజు బకాయిలు, విద్యార్థుల మృతులపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: నరేందర్ రెడ్డి

కలం, ​కరీంనగర్: ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ అంశాలపై మాట్లాడేందుకు కరీంనగర్ వస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) కు మాట్లాడే నైతిక హక్కు లేదని, ముందుగా తమ హయాంలో జరిగిన వైఫల్యాలపై ప్రజలకు, విద్యార్థులకు సమాధానం చెప్పాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) డిమాండ్ చేశారు.

​ఈ సందర్భంగా ఆయన కరీంనగర్‌ (Karimnagar) లో విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనపై పలు తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. 2023 డిసెంబర్ 3 వరకు మీ పాలనలో రూ. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కొండలా ఎందుకు పెండింగ్‌లో పెట్టారో ముందుగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల గోల్‌మాల్‌తో 24 మంది అమాయక విద్యార్థులు మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోవడానికి నాటి ప్రభుత్వ వైఫల్యమే కారణం కాదా? అని ప్రశ్నించారు.

​ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివిన నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ గ్రూప్ పరీక్షల పేపర్లు లీక్ చేసింది మీ హయాంలో కాదా?, 2014, 2018 ఎన్నికల్లో ‘ఇంటికో ఉద్యోగం’ ఇస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా, పేపర్ లీకేజీలతో నిరుద్యోగులను మానసిక క్షోభకు గురిచేసిన మాట వాస్తవం కాదా?,​ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పి ఆ హామీని నీరుగార్చి విద్యార్థులను మోసగించింది మీ ప్రభుత్వం కాదా?, పదేళ్ల పాలనలో యూనివర్సిటీలకు పూర్తిస్థాయి వీసీలను నియమించకుండా, ఇంఛార్జ్ వీసీలతో కాలయాపన చేస్తూ ఉన్నత విద్యను ఎందుకు నిర్వీర్యం చేశారు? అంటూ ప్రశ్నించారు.

​గత పాలనలో విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న కేటీఆర్.. ఇప్పుడు కరీంనగర్ వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పైన పేర్కొన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతే కెటిఆర్ కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టి మాట్లాడాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>