కలం, వెబ్ డెస్క్ : ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన మెగా డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవాన్ని (ఉపాధ్యాయ దినోత్సవం) పురస్కరించుకుని వైసీపీ ఎమ్మెల్సీలు (YSRCP MLCs Protest ) ‘గురు పరిరక్షణ దీక్ష’ పేరిట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేశ్ బాబు, ఇసాక్, కల్పలతారెడ్డి, కుంభా రవిబాబు, చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, సిపాయి సుబ్రహ్మణ్యం, లేళ్ల అప్పిరెడ్డి, పాలవసల విక్రాంత్ తో పాటు వైసీపీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు.
సీబీఐ విచారణకు డిమాండ్
ఈ సందర్భంగా డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, స్పోర్ట్స్ కోటా కేటాయింపులు,నార్మలైజేషన్ ప్రక్రియలో భారీగా గోల్మాల్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, బ్యాక్‌డోర్ విధానంలో పోస్టులను కట్టబెట్టారని ఆరోపించారు. ఈ అక్రమాలపై నిజానిజాలు బయటకు రావాలంటే తక్షణమే సీబీఐ చేత విచారణ జరిపించాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు కొనసాగనున్న ఈ ‘గురు పరిరక్షణ దీక్ష’లో వైసీపీ ఎమ్మెల్సీలతో పాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ”మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ” అనే నినాదాలతో హోరెత్తించారు.

