కలం, వెబ్ డెస్క్ : మెగా డీఎస్సీలో అక్రమాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan ) మరోసారి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? అంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఒక దగా డీఎస్సీ అని తేలిపోతుంటే ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ చేత రాజీనామా చేయించకుండా .. అబద్ధాలు చెప్తూ కొడుకును ఎందుకు కాపాడుతున్నారు చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఒన్-టు-ఒన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా, పోస్టు ఎలా ఇచ్చారు? అంటూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. అనేక జిల్లాల్లో డీఎస్సీ–2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు. డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయాలని, అలాగే మెగా డీఎస్సీ స్కామ్ పై బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నామని స్పష్టం చేశారు.

