కలం, స్పోర్ట్స్: భారత మాజీ క్రికెటర్ యూవరాజ్ సింగ్ (Yuvraj Singh) తన మెంటీ అభిషేక్ శర్మకు 26వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పాడు. అభిషేక్‌తో కలిసి ఉన్న సరదా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో తొలి బంతికే భారీ షాట్ ఆడొద్దంటూ అభిషేక్‌ను యూవీ సరదాగా హెచ్చరించాడు. తప్పు చేసినందుకు చెవులు పట్టించి సిట్‌అప్స్ కూడా చేయించాడు. ఈ వీడియోలో యూవరాజ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కలిసి వింబుల్డన్ మ్యాచ్‌ను స్టాండ్స్ నుంచి వీక్షించిన దృశ్యాలు కూడా ఉన్నాయి.
ఈ సందర్భంగా అభిషేక్ యూవీ ఆశీర్వాదం కోరగా, తాను ఎప్పుడూ అతడికి అండగా ఉంటానని యూవీ తెలిపాడు. అభిషేక్ ఎదుగుదలలో యూవరాజ్ కీలక పాత్ర పోషించాడు. అతడి మార్గదర్శకత్వంలో అభిషేక్ టీ20 క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అభిషేక్ ఇప్పటివరకు రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. భారత్ తరఫున టీ20ల్లో 37 బంతుల్లో సెంచరీ చేసిన అతడు.. ఈ ఫార్మాట్‌లో దేశం తరఫున రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్‌గా ఉన్నాడు.
అయితే ఇటీవల అతడి ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. చివరి పది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. తదుపరి అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌లో అభిషేక్ బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్‌లో తన ఫామ్‌ను తిరిగి అందుకోవాలని అతడు చూస్తున్నాడు.

