కలం వెబ్ డెస్క్ : ఏపీలోని అమరావతి(Amaravati)లో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డీసీఎం(DCM)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై, రాచర్ల మండలంలోని రంగారెడ్డిపల్లి గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన జయరామిరెడ్డి, వెర్రి స్వామిలు డీసీఎంలో అనంతపురం నుంచి విజయవాడకు బయలుదేరారు. మార్గమధ్యలో డీసీఎంలో మంటలు చెలరేగాయి. జాగ్రత్తపడి ఇద్దరూ వాహనం దిగేలోపే మంటలు వ్యాపించాయి. దీంతో వెర్రి స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జయరామి రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అసలు మంటలు ఎలా వ్యాపించాయన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


