కలం, జగిత్యాల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రసాదరావు అధ్యక్షతన గురువందన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన 85 మంది ఉపాధ్యాయులు, ఎంఈవోలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, డీఈవో కె. రాము సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానన్నారు. పెండింగ్ పీఆర్సీ, డీఏ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
క్రీడల్లోనూ ప్రోత్సహించాలి..
డీఈవో కె.రాము మాట్లాడుతూ.. చదువుతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపాధ్యాయులు పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. తపస్ రాష్ట్ర అధ్యక్షులు ఓడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి కొక్కుల రాజేష్ మాట్లాడుతూ.. మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగించే విద్యను అందించాలని కోరారు. ప్రధాన వక్త అప్పల ప్రసాద్ మాట్లాడుతూ… 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థుల్లో జాతీయ భావజాలాన్ని పెంపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు వీరమల్ల వెంకటరమణారావు, బోనగిరి దేవయ్య, మల్హాల్ రావు, అందె శివప్రసాద్, చెరుకు మహేశ్వర్ శర్మ, ఎలిగేటి రాజేంద్రప్రసాద్, వివిధ మండల విద్యాధికారులు, జిల్లా బాధ్యులు నాగమల్ల రమేష్, కొండూరి రజినీకాంత్, శ్రీనివాసరావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు కొలిచాల రవీందర్, అశోక్ రావు, గడ్డం మైపాల్ రెడ్డి, సత్యనారాయణరావు, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Also Read : వరంగల్‌లో హనీట్రాప్.. ప్రేమ పేరుతో రూ.15 లక్షల మోసం
Follow Us On: X(Twitter)

