కలం, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పురానిపేట (Puranipet) శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయం శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తిభావంతో పులకించింది. ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి కరుణ కోసం సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం లలితా సహస్రనామ పారాయణంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తిగీతాలాపనల మధ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు కొత్త ప్రతాప్ మాట్లాడుతూ.. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, కుంకుమ పూజ ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక అని అన్నారు. ఆలయ అభివృద్ధికి భక్తులందరి సహకారం అవసరమని కోరారు.
నల్మాస్ గంగాధర్ మాట్లాడుతూ.. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఈ పూజలను మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ రమేష్, అవారి కైలాసం, ఉప్పగండ్ల రవీందర్, బట్టు సుజాత, చెట్ల జానకి, శ్రీదేవి, ఆలయ అర్చకులు మామిడి రాము తదితరులు పాల్గొన్నారు.
Also Read : కేసీఆర్‌కు కాంగ్రెస్ షాక్.. మహా ధర్నాకు సిద్ధం!
Follow Us On : WhatsApp

