కాంగ్రెస్ అరాచకాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది: బీజేపీ

కలం, కరీంనగర్: కేశవపట్నం మండల కేంద్రంలో బీజేపీ (BJP) ఎస్సీ మోర్చా మండల శాఖ అధ్యక్షులు కనకం కుమారస్వామి మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, మహనీయుడు సంత్ రవిదాస్ చిత్రపటంపై నల్లరంగు చల్లి అవమానించడాన్ని నిరసిస్తూ, అలాగే నల్గొండ జిల్లాలో బీజేపీ క్యాంపు కార్యాలయం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు.  ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం, సంత్ రవిదాస్ చిత్రపటాన్ని అవమానించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాలో బీజేపీ క్యాంపు కార్యాలయంపై, బీజేపీ (BJP) జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని అన్నారు. ఈ దాడిలో ఆయన తల్లి గాయపడటం అత్యంత అమానుషమని, మహిళల పట్ల కూడా కనీస గౌరవం లేకుండా కాంగ్రెస్ శ్రేణులు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఏనుగుల అనిల్ మాట్లాడుతూ.. “ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మా హెచ్చరిక. భారతీయ జనతా పార్టీ సహనాన్ని చేతకానితనంగా భావించవద్దు. హద్దుల్లో ఉండండి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికే గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ, ప్రతిపక్షాలపై దాడులు చేయడం మానుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఉద్యమించాలని నిర్ణయించుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మనుగడ ఉండదు. ప్రజల సమస్యలను పరిష్కరించి సుపరిపాలన అందించడంపై దృష్టి పెట్టాలి. అరాచకాలు, గూండాయిజం, ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పాలి” అని హెచ్చరించారు.

బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ మరింత ఉద్ధృతంగా పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ దండు కొమురయ్య, మాజీ ఎంపీపీ దొంగల రాములు, జిల్లా కౌన్సిల్ మెంబర్ దాసరపు నరేందర్, బీజేపీ సర్పంచ్లు వెన్నం మల్లేశం కొయ్యడ కుమార్ యాదవ్, ఉప సర్పంచ్ జంగ జైపాల్, కొయ్యడ అశోక్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మచెట్టు సంపత్ రావు, మండల ఉపాధ్యక్షులు ఎలుక పెళ్లి సంపత్, రాసమల్ల శ్రీనివాస్, కార్యదర్శి గౌరవేణి శ్రీనివాస్, బిజిలి సారయ్య, బోడ తిరుపతిరెడ్డి, మహిళ మోర్చాఅధ్యక్షురాలు చర్ల అనిత, యువ మోర్చా మండల అధ్యక్షుడు బొజ్జ సాయి ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు పలకల రాజిరెడ్డి, మందాడి జగ్గారెడ్డి, రాజిరెడ్డి, జానపట్ల రాజిరెడ్డి, దాసరి సంపత్, చర్ల శ్రీనివాస్, శివారెడ్డి, వీరా అర్జున్, రంజిత్ శ్రీనాథ్, కుమార్, వికాస్, సాయి, మైపాల్, బీజేపీ మండల నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, శక్తికేంద్ర ఇన్‌చార్జులు, బూత్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : సెంచరీతో స్మృతి మందానా చరిత్ర.. హాంకాంగ్ చిత్తు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>