కలం డెస్క్ : బీఆర్ఎస్, బీజేపీలను నేరుగా ఢీకొట్టడానికి ముఖ్యమంత్రి రెడీ అవుతున్నారు. ఒకవైపు హిల్ట్ పాలసీ, మరోవైపు జీహెచ్ఎంసీ డివిజన్ల రీఆర్గనైజేషన్ (GHMC Reorganization) అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రెండు ప్రతిపక్ష పార్టీలూ సిద్ధమవుతున్న తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రి (Revanth Reddy) రంగంలోకి దిగనున్నారు. శాస్త్రీయత లేకుండా, అర్థరహితంగా జీహెచ్ఎంసీ వార్డులను విడగొట్టారని బీజేపీ, బీఆర్ఎస్ విమర్శిస్తున్న నేపథ్యంలో వాటికి అసెంబ్లీ వేదికగానే పురపాలక శాఖ మంత్రిగా సీఎం సూటిగా బదులివ్వాలనుకుంటున్నారు. దీనికి తోడు పోలీసు కమిషనరేట్లను కూడా రీఆర్గనైజ్ చేయడంతో హోంశాఖ మంత్రిగా కూడా విపక్ష సభ్యుల వాదనలకు ధీటుగా సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులతో రివ్యూ చేసి దిశానిర్దేశం చేశారు.
మతానికి ముడిపెట్టిన బీజేపీ :
ఓల్డ్ సిటీలో ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ వార్డుల విభజనను ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిందని బీజేపీ ఆరోపించింది. పాలనాపరమైన అంశాలకంటే పార్టీకి ప్రయోజనం ఉండే విధంగా వార్డుల విభజన జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, పార్టీల ప్రతినిధులతో చర్చలు జరపకుండా కాంగ్రెస్ కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రక్రియకు తెర లేపిందన్నారు. పాత వార్డులను విడగొట్టడం, కొత్త వార్డులను క్రియేట్ చేయడంలో పారదర్శకత లోపించడంతో పాటు ప్రజలకు సమాన ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. ముస్లిం మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసి హిందు ఓటు బ్యాంకును ఒంటరి చేసే తీరులో వార్డుల విభజన జరిగిందని, ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు.
రాజకీయ ప్రేరేపితమైన చర్య : బీఆర్ఎస్
రాజకీయ అవసరాల కోసమే జీహెచ్ఎంసీ వార్డుల విభజన చేసిందని ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీఆర్ఎస్.. తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోకుండానే వార్డుల సంఖ్యను డబుల్ చేయడం అర్థరహితమని పేర్కొన్నది. వార్డుల పునర్ వ్యవస్థీకరణపై సమగ్రమైన రివ్యూ చేయాలని, పార్టీల, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మెమొరాండం సమర్పించింది. వార్డుల హద్దులను ఫిక్స్ చేయడంలో, పేర్లను మార్చడంలో, ఒక ప్రాంతాన్ని మరో వార్డులోకి తరలించడంలో సైంటిఫిక్ పద్ధతిని అవలంబించలేదని ఆరోపించింది. ఉదాహరణకు మోండా మార్కెట్ (డివిజన్ నెం. 196) పేరును మారేడ్‌పల్లి అనే పేరుకు మార్చడం, భౌగోళికంగా ఏరకంగానూ సమర్ధనీయం, సమంజసం కాదని పేర్కొన్నది. ఇంకోవైపు హైకోర్టులో సైతం పిటిషన్‌లు దాఖలయ్యాయి.
కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన సీఎం :
జీహెచ్ఎంసీ విస్తరణ, శివారు మున్సిపాలిటీలను విలీనం చేయడం, విస్తీర్ణం పెరగడంతో వార్డుల రీఆర్గనైజేషన్ తదితర ప్రక్రియలకు బీజేపీ మతం రంగు పులమడం, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శించడం.. వీటికి దీటుగా సమాధానం ఇవ్వాలని సీఎం (Revanth Reddy) భావిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, శివారు ప్రాంతాల్లో అభివృద్ధి, నగర ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించడం.. ఇలాంటి అంశాలన్నింటినీ సీఎం ప్రస్తావించే అవకాశమున్నది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో పాలనాపరమైన సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దాదాపు 1.40 కోట్ల మంది జనాభా స్థాయికి జీహెచ్ఎంసీ విస్తరించడంతో ఒకవైపు పౌర సేవలు, మరోవైపు శాంతిభద్రతలు కల్పించడంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టకపోతే ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని, సిటీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో అసెంబ్లీ వేదికగానే స్పష్టత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Read Also: జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందే : సీఎం రేవంత్
Follow Us On: Youtube


