కలం, నకిరేకల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నకిరేకల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహించనున్న “ప్రజా వికాస సభ” ఏర్పాట్లను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో వేదిక నిర్మాణం, సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించి, నాయకులు అధికారులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను సమగ్రంగా సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను, ప్రజా వికాస సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

