కాంగ్రెస్‌కు మహిళలే గుణపాఠం చెబుతారు: ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కలం, కరీంనగర్ బ్యూరో: ​కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ ఎదుట గులాబీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించారు. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ప్రజలు పడుతున్న అవస్థలను ఎండగట్టేందుకు, వారికి అండగా నిలిచేందుకు నగర శాఖ ఆధ్వర్యంలో ‘వంటా వార్పు’ కార్యక్రమాన్ని చేపట్టారు. ​ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar), మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళలతో కలిసి వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మహిళలను నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కార్

​ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం మహిళలతో ముడిపడి ఉంటుందని, అలాంటి మహిళలనే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ‘కళ్యాణ లక్ష్మి’ పథకాన్ని అత్యంత విజయవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని అబద్ధపు హామీలిచ్చి మోసగించిందని విమర్శించారు.

​అంతేకాకుండా, ఆడబిడ్డలకు ప్రతినెలా రూ. 2,500 ఇస్తామని, చదువుకునే విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందజేస్తామని అనేక అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, నేడు ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.

​అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం

​ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు మహిళల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని, ఇదే పట్టుదలతో రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తేల్చిచెప్పారు. నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, కొండా సురేఖ బర్తరఫ్ విషయానికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అది ఆ పార్టీ అంతర్గత విషయమని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులు పూర్తయింది.. మరో 825 రోజులు మాత్రమే మిగిలి ఉంది కానీ, ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, కొండా సురేఖ రూపంలో మొదటి వికెట్ పడిందన్నారు. కాంగ్రెస్ మంత్రి వర్గంలో రెండు కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని కొండా సురేఖ చెప్పారని, ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందని నాకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపే శక్తి రోజురోజుకూ రేవంత్ రెడ్డి కోల్పోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి మంచి మంచి స్పందన ఉందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తమ పోరాటాలను మరింత ఉదృతం చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్‌లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, సుధగోని మాధవి, గాదె రూప, యూసుఫ్, అలీ, జమ్ము, కరీంనగర్ రూరల్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్‌లు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Also Read : 400 ఎకరాల భూములపై కలెక్టర్ స్పష్టత ఇవ్వాలి: శ్రీనివాస్ గౌడ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>