కలం, ఖమ్మం బ్యూరో: హైదరాబాద్‌లో నిరుపేద గిరిజన యువతి ఊకే శిరీషను హత్య చేసి, అనంతరం లైంగిక దాడికి పాల్పడటం మానవ మృగం చేసిన అత్యంత దారుణమైన చర్య అని.. ఈ ఘటనతో సభ్యసమాజం తలదించుకుంటోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti) తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని చౌటిగూడెం గ్రామానికి వెళ్లిన మంత్రి, మృతురాలు శిరీష తల్లి, అన్న, వదినలను పరామర్శించారు.
ఆ క్షణంలో మృతురాలి తల్లి ఆవేదనను చూసి మనసు కలత చెందిన మంత్రి పొంగులేటి (Minister Ponguleti) తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును, ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్‌ను వెంటనే అందజేసి, కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
బాధితుల ఇంట్లో నుంచే సీపీతో ఫోన్ మాట్లాడిన మంత్రి
పరామర్శ సమయంలోనే మంత్రి పొంగులేటి, బాధితుల ఇంట్లో నుంచే పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీపీతో ఫోన్‌లో మాట్లాడారు. నర్సింగ్ విద్యార్థిని శిరీష బస చేసిన వసతి గృహాన్ని తక్షణమే తనిఖీ చేసి, భద్రతా చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే సదరు హాస్పిటల్‌ను సీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఎఫ్‌ఐఆర్‌లో హాస్పిటల్, వసతి గృహ నిర్వాహకుల పేర్లను ఎందుకు చేర్చలేదో వివరణ కోరుతూ వారిపై అదనపు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఐటీడీఏ జాబ్ మేళా ద్వారా ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు వెళ్లి, ఇలా బలైపోవడం ఆ కుటుంబానికి తీరని లోటని మంత్రి అన్నారు. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించి, నిందితుడికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా చూస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ,కోరం కనకయ్య, ఐటీడీఏ పీవో రాహుల్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
Also Read : సీఎం రేవంత్, పొంగులేటిపై హరీశ్ రావు ఆగ్రహం
Follow Us On: X(Twitter)

