కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం పరిశీలించారు. మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ ప్రియాంక హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కళాశాల భవన నిర్మాణ నమూనా చిత్రపటాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలలు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 4 ఎకరాల స్థలంలోని 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐడీసీ ఎండీ. గణపతిరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం భవనం లోపల జరుగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు.
కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహారీ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంకకు ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే మార్చి నెలలోపు కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మద్దూరు ప్రాంతంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
గురుకుల బాలికల పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన
ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో చింతల్ దిన్నే వైపు కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పనుల్లో జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ ప్రతి పడవద్దని సూచించారు. పనులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అయితే గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, మద్దూరు మున్సిపల్ చైర్ పర్సన్ సరస్వతీ, మద్దూరు మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నరసింహులు, వీరేశ్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

