కలం, వెబ్‌డెస్క్: భారత మహిళల జట్టు 2025ను ఘనంగా ముగించింది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి టీ20లో 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (Harmanpreet) (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) మెరవడంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ(5), కమలిని(12)తోపాటు హర్లీన్ డియోల్(13), రిచా ఘోష్(5), దీప్తి శర్మ(7) స్వల్ప స్కోర్లకే వెనుదిరగ్గా అమన్‌జ్యోత్ కౌర్(21; 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)తో కలసి ఆరో వికెట్‌కు హర్మన్ ప్రీత్ 61 పరుగులు జోడించింది. చివర్లో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (27 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) మెరుపులు మెరిపించింది. శ్రీలంక బౌలర్లలో ఆటపట్టు, రష్మిక, కవిష తలో రెండు వికెట్లు తీయగా, మధుషాని 1 వికెట్ దక్కించుకుంది.
అనంతరం ఛేదనలో శ్రీలంక ఆదిలోనే కెప్టెన్ చమరి ఆటపట్టు(2) వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనర్ హాసిని పెరీరా(65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమేషా దులానీ(50; 39 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో గెలుపుపై తమ జట్టుకు ఆశలు రేకెత్తించారు. హాసిని పెరీరా ఆఖరి వరకు పోరాడినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి , వైష్ణవి శర్మ , శ్రీ చరణి , అమన్‌జ్యోత్ కౌర్, స్నేహ్ రాణా తలో వికెట్ పడగొట్టారు. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కాయి.


