కలం, వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని (Vishal Gunni), కాంతారాణా టాటాకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. వారిద్దరిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసింది. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. 2024 సెప్టెంబర్ నుంచే వారిపై సస్పెన్షన్ విధించింది. పలుమార్లు పొడిగిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారికి ఎలాంటి పోస్టింగులు ఇవ్వలేదు. తాజాగా సస్పెన్షన్ ఎత్తేసినా.. వారిపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
ముంబయికి చెందిన మోడల్ జెత్వానీని వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టి వేధించారనేది విశాల్ గున్ని, కాంతారాణా టాటాలపై ఉన్న ప్రధాన అభియోగం. వీరిద్దరిపై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో కేసులు కూడా నమోదు కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వీరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. అప్పటి నుంచి పోస్టింగులు లేకుండా, అమరావతిని విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. అయితే, జెత్వానీ కేసులో సీఐడీ విచారణ పూర్తయి ఛార్జిషీట్ దాఖలు కావడంతో వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రివ్యూ కమిటీ భావించి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

