కలం, మెదక్ బ్యూరో: నర్సాపూర్‌లోని 22A నిషేధిత భూముల జాబితాను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహా ధర్నా (BJP Maha Dharna) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. “గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబంలో నలుగురే దోచుకుంటే, ప్రస్తుత రేవంత్ రెడ్డి ఇంట్లో ఏడుగురు దోచుకుంటున్నారు. కేసీఆర్‌ను ప్రజలు బొంద పెట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు, రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రేవంత్ రెడ్డి పేదల భూములు కొల్లగొట్టడంలో రీసెర్చ్ స్కాలర్‌గా మారారు” అని ధ్వజమెత్తారు.
అనంతరం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వ ధరణి కంటే ప్రస్తుత భూ భారతి పోర్టల్ మరింత నిర్లక్ష్యంగా తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులతో కుమ్మక్కై లక్షల ఎకరాల భూములను కాజేస్తోంది. తప్పులు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. “గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడు దోచుకుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదమ్ముళ్లు దోచుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టడానికి దొంగ-పోలీస్ ఆట ఆడుతున్నాయి. వేల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ నాయకులలో ఒక్కరినైనా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా? ధరణి, భూ భారతి వ్యవస్థల వల్ల దోచుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు” అని మండిపడ్డారు. ఈ మహా ధర్నా(BJP Maha Dharna)లో స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : బీసీసీఐ బిగ్ రివ్యూ: గంభీర్, అగార్కర్, లక్ష్మణ్‌లకు పిలుపు!
Follow Us On: X(Twitter)

