కలం, జోగులాంబ గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆంజనేయగౌడ్, గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ బాసు హన్మంతునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ విమర్శించారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బుధవారం బీఅర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ బాసు హన్మంతు నాయుడు ఆధ్వర్యంలో గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కిష్టారెడ్డి బంగ్లా నుంచి క్రిష్ణవేణి చౌరస్తా వరకు 420 హామీలతో కూడిన బ్యానర్‌తో భారీ ర్యాలీ (BRS Protest) చేపట్టారు.
ఆరు గ్యారంటీల వైఫల్యం, 420 హామీల మోసం, 1000 రోజుల పాలనలో ప్రజలకు తీరని అన్యాయం చేశారంటూ బిఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 డెకరేషన్లతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొక్కిపెట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.
మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అమలు చేయని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా వారి మాటలు వింటే ప్రజల రక్తం మరుగుతోందని, హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నడిగడ్డ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. స్థానికంగా ప్రజాస్వామ్యం కాకుండా “గ్యాంగ్స్టర్ల పరిపాలన” సాగుతోందని ఆయన ఆరోపించారు. తుంగభద్ర నీటిని తరలించుకుపోతున్నా రేవంత్ రెడ్డి దీనిపై ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
దీని వల్ల జూరల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ పరివాహక ప్రాంత రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నీటి కోసం రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ పున:నిర్మాణం కోసం పార్టీ శ్రేణులు యాగంలా కృషి చేయాలని ఆంజనేయగౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

