కలం, నిర్మల్: కుబీర్ (Kubeer Mandal) మండలంలోని శివునితాండ-2 (సీతాభాయి తాండ)లో శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయ (Sri Jagadamba Sevalal Temple) పునర్నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం శంకుస్థాపన చేశారు. ధర్మాదాయ శాఖ సీజీఎఫ్ నిధుల నుంచి రూ.30 లక్షలతో ఈ పునర్నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయం బంజారా సమాజానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆలయమని పేర్కొన్నారు.
ఆలయ పునర్నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరు కావడం సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

