కలం, కరీంనగర్: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కరీంనగర్లోని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఉచిత మెగా వైద్య శిబిరం, నగరంలో భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఉదయం కరీంనగర్ (Karimnagar) మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని సీనియర్ డివిజనల్ మేనేజర్ శివ నాగ ప్రసాద్ ప్రారంభించారు.
ప్రజలు భద్రత కోసం పాలసీలు తీసుకోవాలి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ఐసి యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల సంక్షేమమేనని పేర్కొన్నారు. “యోగక్షేమం వహామ్యహమ్” అనే సూక్తిని త్రికరణశుద్ధిగా పాటిస్తూ సామాజిక బాధ్యతలో భాగంగానే ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం నమ్మకమైన ఎల్ఐసీ పాలసీలను తీసుకోవాలని ఆయన కోరారు. మెడికవర్ ఆసుపత్రి కోఆర్డినేటర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎల్ఐసి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ లోకేష్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ మమతలతో పాటు నర్సింగ్ సిబ్బంది వైద్య సేవలందించారు. దాదాపు 200 మందికి పైగా వాకర్స్ ఈ ఉచిత వైద్య పరీక్షలను చేయించుకొని, వైద్యుల సలహాలు స్వీకరించారు.
అకట్టుకున్న భారీ ర్యాలీ..
సాయంత్రం 4:00 గంటలకు ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ అంబేద్కర్ స్టేడియం, కలెక్టరేట్ రోడ్, గీతా భవన్ మీదుగా సాగింది. బీమా ఆవశ్యకతను, ఎల్ఐసీ విశిష్టతను చాటిచెప్పే ప్లకార్డులతో సాగిన ఈ ర్యాలీ పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్, సేల్స్ మేనేజర్ హరికృష్ణ, సిఆర్ఎమ్ మేనేజర్ వేణుగోపాల్, డివిజనల్ ఆఫీస్ ఉద్యోగులు, ఏజెంట్ల సంఘం నాయకులు ప్రభాకర్ రావు, గట్టు రాజయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో ఏజెంట్లు పాల్గొన్నారు.

