కలం, వెబ్‌డెస్క్: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) రేపు బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ఎపీ) అధ్యక్షురాలు ఖలీదా జియా నేడు (మంగళవారం) మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు రాజధాని ఢాకాలోని జియా ఉద్యాన్‌లో జరగనున్నాయి. అక్కడే ఆమె భర్త జియావుర్ రహమాన్ సమాధి ఉంది. దాని పక్కనే ఖలీదాను ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరఫున జైశంకర్ హాజరవుతారు. ఈ మేరకు భారత విదేశాంగ వెల్లడించింది. కాగా, ఖలీదా జియా 1991–96, 2001–06 మధ్య రెండు సార్లు బంగ్లా ప్రధానిగా పనిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు భారత్ కంటే ఎక్కువగా చైనాకు సన్నిహితంగా మెలిగారు. షేక్ హసీనా హయాంలో జైలు జీవితం అనుభవించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. ఆమె మృతికి ప్రధాని మోదీ, బంగ్లా పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా సంతాపం తెలిపారు. కాగా, కొన్ని రోజుల నుంచి బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ఆందోళనలు, నిరసనలతోపాటు హిందువులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) హాజరవుతుండడం ఈ రెండు దేశాలతోపాటు ప్రపంచం ఆసక్తికరంగా గమనిస్తోంది.


