కలం/ఖమ్మం బ్యూరో : భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా సీతారామచంద్రస్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులు. ఆలయప్రాంగణమంతా జై శ్రీరామ్ నామస్మరణలతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భద్రాచలం (Bhadrachalam) ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, వీఐపీ సెక్టార్లతో పాటు సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన వివిధ సెక్టార్లలో భక్తులు శాంతియుతంగా వేడుకలను తిలకించారు. వేదపండితులు, స్థానాచార్యులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించగా, అర్చకులు 108 ఒత్తులతో మహా హారతి నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం తర్వాత ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించారు.
మాడ వీధుల్లో స్వామివారు గరుడ వాహనరూపుడిగా శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. సంప్రదాయం ప్రకారం భద్రాచలం (Bhadrachalam) తహసీల్దార్ శ్రీనివాస్ మూలవిరాట్టులకు స్నపన కార్యక్రమం నిర్వహించారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరో వాహనంపై అండాళ్ అమ్మవారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజవాహనంపై సీతమ్మవారు, గరుడ వాహనంపై సీతారామచంద్రమూర్తుల తిరువీధి సేవ వైభవంగా సాగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్ రావు, పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐటిడిఏ పీవో రాహుల్, ట్రైనీ కలెక్టర్ సొరబ్ శర్మ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఏఎస్పీ విక్రాంత్ సింగ్, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ దొర తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఉత్సవాలు విజయవంతం – కలెక్టర్
సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో, అన్ని శాఖల సమన్వయంతో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం విజయవంతంగా నిర్వహించామన్నారు కలెక్టర్ జితేష్ వి.పాటిల్. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి, భక్తులకు, పాత్రికేయులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Read Also: టోల్ ఫ్రీకి అనుమతి ఇవ్వండి: కేంద్రానికి కోమటిరెడ్డి లేఖ
Follow Us On: Pinterest


