కలం, కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు (Youth Congress) చేపట్టిన ఆందోళనపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం, కార్యాలయ గేటుకు నల్లరంగు పూయడం వంటి చర్యలపై ఆయన పోలీసుల తీరును ప్రశ్నించారు. పట్టపగలు జాతీయ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా? అని నిలదీశారు.
బీజేపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు.“కాంగ్రెస్‌కు పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారా?” అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడుతుంటే అక్కడ పోలీసులు ఎందుకు లేరని నిలదీశారు. పోలీసుల వైఫల్యానికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించిన బండి సంజయ్.. బీజేపీ సహనాన్ని చేతగానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు.
బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్
బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనకు బాధ్యులైన యూత్ కాంగ్రెస్ నేతలను సాయంత్రంలోపు అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూత్ కాంగ్రెస్ నేతల చర్యలకు తగిన విధంగా ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు. బీజేవైఎం కార్యకర్తలు తలుచుకుంటే యూత్ కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ శ్రేణులు శాంతియుతంగా ఉండాలని కూడా సూచించారు.
కాంగ్రెస్ కార్యాలయాల దిగ్బంధనంపై హెచ్చరిక
ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకత్వం తక్షణమే స్పందించాలని బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యాలయాలను బీజేపీ శ్రేణులు దిగ్బంధిస్తాయని హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : ఉద్యోగుల ఆగ్రహ జ్వాల.. రేవంత్ సర్కార్‌కు సెప్టెంబర్ టెన్షన్!
Follow Us On : WhatsApp

