కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తున్న పాంచజన్యం సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసలు తాను ఏం తప్పు చేశానని పార్టీలో నుంచి వెళ్లగొట్టారని వెక్కి వెక్కి ఏడ్చారు. ఎలాంటి కారణంగా లేకుండా తనను తీహార్ జైల్లో పెట్టారన్నారు. సుప్రీం కోర్ట్ జడ్జి కూడా తన నిజాయితీని గుర్తించి, తనపై కేసు పెట్టిన సీబీఐ అధికారినే జైల్లో పెట్టాలని చెప్పారని గుర్తు చేశారు. నిజామాబాద్ కోడలిగా ఇక్కడి ప్రజలకు తానేంటో తెలుసన్నారు. ‘పార్టీ పెట్టిన తర్వాత సొంత గడ్డకు రావడం ఆనందంగా ఉంది. స్వరాష్ట్రం వచ్చినా మన బతుకులు మారలేదు. సంపాదన పెరిగిందా..? కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరంలో అయినా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పారిందా..? నేను కూడా ఆ పార్టీలోనే ఉన్నా. ప్రయత్నం చేశాం. కానీ సాధ్యం కాలేదు. కొత్త తాళం చెవి కావాలి. కొత్త శక్తి కావాలి. మిమ్మల్ని చూసే ముందుకు వెళ్తున్నా. మీరంతా నాకు ధైర్యం ఇవ్వాలి’ అని నిజామాబాద్ ప్రజలను కవిత కోరారు.

