కలం, వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లు దేశానికంతటికీ సమస్య అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah ) అన్నారు. మంగళవారం కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు, వలసలను మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఈ అక్రమ చొరబాట్ల కొన్నేళ్లుగా రాష్ట్ర జనాభా స్థితిని ప్రమాదకరంగా పెంచేశాయని ఆరోపించారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని, అవసరమైన భూమిని కేటాయించడం లేదని మండిపడ్డారు.
చొరబాట్లపై బెంగాల్ ప్రజలు తీవ్ర ఆవేదన, ఆవేశంతో ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే చొరబాట్లకు, వాటి వల్ల వచ్చిన సమస్యలకు బీజేపీ ప్రభుత్వం చెక్ పెడుతుందని భరోసా ఇచ్చారు. ‘మేం అధికారంలోకి వస్తే కేవలం చొరబాటుదారులను గుర్తించడమే కాదు, వారిని బయటికి పంపించేస్తాం. ఇది తథ్యం. రాష్ట్రంలో ఏప్రిల్ 15, 2026 తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. ఇది రాష్ట్ర ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు’ అని అమిత్ షా అన్నారు.
300 మంది బీజేపీ కార్యకర్తల్ని చంపారు:
‘సర్’(SIR) సర్వే వల్ల రాష్ట్రంలోని మతువ తెగ ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని అమిత్ షా (Amit Shah) చెప్పారు. వాళ్లకు మమతా బెనర్జీ సైతం హాని చేయలేదని భరోసా ఇచ్చారు.‘ పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వంతోపాటే హింస, హత్యా రాజకీయాలు అంతమైపోయాయని భావించాం. కానీ, మమత ప్రభుత్వం కమ్యూనిస్టులను మించిపోయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 300 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. 3వేల మందికి పైగా కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదు. టీఎంసీ జెండా మోస్తేనే వాళ్లను ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇస్తామంటున్నారు’ అని అమిత్ షా ఆరోపించారు.
మమత ప్రభుత్వ విధానాల కారణంగా పశ్చిమ బెంగాల్ (West Bengal) నుంచి దాదాపు 7వేలకు పైగా పరిశ్రమలు తరలిపోయాయని చెప్పారు. ‘కాంగ్రెస్కు, కమ్యూనిస్టులకు, టీఎంసీకి అవకాశమిచ్చారు. మాకూ ఒక ఛాన్స్ ఇవ్వండి. మీలో గూడుకట్టుకొని ఉన్న భయం తొలగిస్తాం. రాష్ట్రంలో అవినీతిని అంతమొందిస్తాం. తప్పుడు పరిపాలనను సరిదిద్ది స్వచ్ఛమైన పాలన అందిస్తాం’ అని బెంగాల్ ప్రజలను అమిత్ షా కోరారు.
Read Also: ‘సర్’ పెద్ద స్కామ్.. ఒక్క ఓటు గల్లంతైనా ఈసీ ముట్టడి : మమత
Follow Us On: Sharechat


