కలం డెస్క్ : గాంధీ కుటుంబం ఈసారి న్యూఇయర్ వేడుకలను రాజస్థాన్‌లోని రణథంబోర్ (Ranthambore) ఫారెస్టులో జరుపుకోనున్నది. ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నమే రాహుల్‌గాంధీ (Rahul Gandhi), ప్రియాంకాగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రేహాన్ వాద్రా తదితరులు ప్రైవేటు కారులో చేరుకున్నారు. వారు నేషనల్ పార్కు సమీపంలోని ఓ స్టార్ హోటల్లో బస చేస్తున్న వారు జనవరి 2వ తేదీ వరకు బస చేయనున్నారు. ఫారెస్టులో సఫారీకి వెళ్ళాలనే ప్లాన్ ఉన్నట్లు అక్కడి కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. లగ్జరీ హోటల్‌ను ఖాళీ చేసి ఓ స్టార్ రిసార్టులో ఉండొచ్చని తెలిపారు. ఇది పూర్తిగా గాంధీ ఫ్యామిలీ వ్యక్తిగత పర్యటనగానే ఉంటుందని పేర్కొన్నాయి. రాహుల్, ప్రియాంకా, రాబర్ట్ వాద్రా ఒకేసారి రాగా రేహాన్ వాద్రా మాత్రం ముందుగానే చేరుకున్నట్లు వివరించాయి. కుటుంబమంతా కలిపి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో రణథంబోర్ ఫారెస్టును ఎంచుకున్నట్లు తెలిపాయి.
గాంధీ ఫ్యామిలీకి ఇష్టమైన టూరిజం స్పాట్ :
గాంధీ ఫ్యామిలీ నేషనల్ పార్కులోని వివిధ జోన్లను వేర్వేరు రోజుల్లో సందర్శించేలా ప్రణాళిక రూపొందించుకున్నట్లు జూ అధికారులు తెలిపారు. సఫారీ సమయంలో పులుల్ని చూసే అవకాశం ఉందన్నారు. గాంధీ కుటుంబానికి రణథాంబోర్ ఇష్టమైన విహార గమ్యస్థానమని గుర్తుచేశారు. ఈ ఏడాది రాహుల్ గాంధీ (Rahul Gandhi) రణథాంబోర్ను సందర్శించడం రెండోసారి. ప్రియాంక గాంధీ వాద్రాలకు ఇది మూడో టూర్. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ రణథంబోర్‌లో జంగిల్ సఫారీ చేసి ఆడ పులి ‘ఏరోహెడ్’ను, దాని పిల్లలను సహజ వాతావరణంలో చూసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వివరించారు. ఇటీవలే 11 ఏళ్ల వయసులో ఆ పులి ఈ ఏడాది జూన్ 19న చనిపోయింది. ఉత్తర భారతదేశంలోనే రణథంబోర్ నేషనల్ పార్కుకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు సుమారు 130 కి. మీ దూరంలో సవాయ్ మాధోపూర్ జిల్లా పరిధిలో ఈ పార్కు ఉన్నది. ఒకప్పుడు జైపూర్ మహారాజుల వేట స్థలంగా ప్రసిద్ధి. ప్రస్తుతం వన్యప్రాణి పర్యాటకానికి కేంద్రంగా మారింది.
Read Also: ఆయన ఎప్పటికైనా తెలంగాణ చంద్రబాబే.. కవిత షాకింగ్ కామెంట్స్
Follow Us On: Youtube


