కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) గగనతల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని అత్యంత సున్నితమైన వీఐపీ–89 జోన్ పరిధిలో గగనతల రక్షణను (Air Defence System) బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దేశీయ సమీకృత ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవస్థ ద్వారా ఢిల్లీ పరిధిలో సుమారు 30 కిలోమీటర్ల వరకు గగనతలలో ఏర్పడే ఏవైనా ముప్పులను గుర్తించి, అడ్డుకునే సామర్థ్యం ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాజధానిలోని కీలక ప్రభుత్వ భవనాలు, పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం వంటి అత్యంత భద్రతా అవసరాలున్న ప్రాంతాల రక్షణకు ఇది ఎంతో కీలకంగా మారనుంది.
ఇటీవలి కాలంలో డ్రోన్లు, తక్కువ ఎత్తులో ప్రయాణించే ఎయిర్ థ్రెట్స్ వంటి ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఢిల్లీ గగనతల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే, గగనతల పర్యవేక్షణ (Air Defence System) మరింత సమర్థవంతంగా మారనున్నది. తక్షణ స్పందనకు అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ముందడుగు పడినట్లవుతుందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజధాని రక్షణలో కీలక మైలురాయిగా మారే అవకాశం ఉంది.
Read Also: ఆ కంటెంట్ తీసేయండి.. సోషల్ మీడియా యాప్ లకు కేంద్రం వార్నింగ్
Follow Us On : WhatsApp


