ఓం.. భీమ్‌.. బుష్‌.. హ‌రీశ్‌.. పొంగులేటి ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఎక్స్ వేదికగా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇటీవ‌ల కాలంలో హ‌రీశ్ రావుపై క్షుద్ర‌పూజ‌ల ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఓం.. భీమ్‌.. బుష్.. హ‌రీశ్ అంటూ సెటైర్లు వేశారు. హ‌రీశ్ రావు పైస‌ల కోసం, ప‌ద‌వుల కోసం ఎంత‌కైనా దిగ‌జారుతార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అగ్గిపెట్టె లేదంటూ నాట‌కం ఆడి యువ‌త‌ను రెచ్చ‌గొట్టి శ‌వ రాజ‌కీయాలు చేశార‌ని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ (BRS) హ‌యాంలో హ‌రీశ్ రావు మంత్రి ప‌ద‌విని అడ్డుపెట్టుకొని డ‌బ్బుల కోసం అనైతికంగా ఆస్ప‌త్రుల‌తో పాల వ్యాపారం చేశాడ‌ని ఆరోపించారు.

హ‌రీశ్ రావు బీఆర్ఎస్ పార్టీని క‌బ్జా చేసేందుకు మ‌రింత దిగ‌జారార‌ని పొంగులేటి విమ‌ర్శించారు. కేసీఆర్‌ (KCR) పై హ‌రీశ్ రావు క్షుద్ర పూజ‌లు చేయించార‌ని, కేసీఆర్ ఆరోగ్యం బాగుండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో హ‌రీశ్ పూజ‌లు చేస్తున్నాడ‌ని స్వ‌యంగా కేసీఆర్ కుమార్తె క‌విత‌ ఆరోపించార‌ని తెలిపారు. హ‌రీశ్ ఇలాంటి వ్య‌క్తి కాబ‌ట్టే త‌న అక్ర‌మాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌న్నారు. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవ‌డానికి ప్ర‌తి రోజు అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని, రాష్ట్ర ప్ర‌జ‌లు ఈ ప్ర‌చారాల‌ను న‌మ్మ‌ర‌ని తెలిపారు.

కేసీఆర్‌పై క్షుద్ర‌ పూజ‌లు మొద‌లు, పాల పేరుతో చేసిన పాపపు వ్యాపారాల దాకా ఎన్నో త‌ప్పులు చేస్తూ.. త‌మ‌పై ప్ర‌తి రోజు పెయిడ్ సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎన్ని కుట్ర‌లు చేసినా ధ‌ర‌ణి పేరుతో దొర‌లు చేసిన దోపిడీని బ‌య‌ట‌కు తీయడం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. హ‌రీశ్ రావు చేసే కుట్ర‌లు సీఎం రేవంత్ రెడ్డి సుప‌రిపాల‌న‌ను అడ్డుకోలేవ‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>