కలం, వెబ్ డెస్క్: 2025 సంవత్సరం తనకు కలసి రాలేదని, తనపై కుట్రలు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఏడాది ఎన్నో కుట్రలు, కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్నా. కానీ లాస్టుకు నాపై కుట్రలు చేసే వాళ్లే గెలిచారు. అందుకే వాళ్లు ఇంకా పార్టీలో ఉన్నారు, నేను మాత్రం బయట ఉన్నా. బీఆర్ఎస్లో ఓ వర్గం నాకు వ్యతిరేకంగా పనిచేసింది. ఇప్పుడు కాదు 2019 నుంచే నాపై కుట్రలు చేసి ఓడించారు. నేను ఏ తప్పు చెయ్యలేదు, కాబట్టి నేను ఎవరికీ భయపడను. అన్ని పార్టీలు కుట్రలు చేసి జైలుపాలు చేశాయి. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నా. అయినా తెలంగాణ కోసం నావంతుగా కృషి చేస్తా’’ అని కల్వకుంట్ల కవిత అన్నారు.
‘‘మా అన్న (KTR) అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్ పార్టీలో చేరాడు. నేను మాత్రం నా సొంతంగా 2006లో తెలంగాణ జాగృతి అనే సంస్థని ఏర్పాటు చేశా. తెలంగాణ ఉద్యమంలోనూ నేను ఇండిపెండెంట్‌గా పాల్గొన్నా. అధికారం చేపట్టాక పార్టీలో ఉన్న కొందరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను కార్నర్ చేస్తున్నారన్న అనుమానం నాకు అప్పుడే కలిగింది. మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విషయంలో SIT నోటీసులు ఇచ్చింది. నా ఫోన్, నా భర్త ఫోన్, ఇంట్లో పని చేసే వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని నాకు అప్పుడు అర్థమైంది.‘‘ అని కవిత అన్నారు.
‘‘మహిళలు రాజకీయాల్లో ఉండడమే నేరమా. మేము రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉండడం తప్పా?. దేశ చరిత్ర తిరగేసినా దేశం కోసం కొట్లాడిన మహిళలెవరికీ పెద్ద పదవులు రాలేదు. గతంలో కేసీఆర్ గారు 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే అందులో ఒక్క మహిళకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఒక్క మహిళకి కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అని నేను ఆరోజే కేసీఆర్‌ను ప్రశ్నించా’’ అని కవిత (Kavitha) చెప్పారు.
Read Also: ఆయన ఎప్పటికైనా తెలంగాణ చంద్రబాబే.. కవిత షాకింగ్ కామెంట్స్
Follow Us On : WhatsApp


