కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అభివృద్ధిలో అలసత్వం వద్దు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందనీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండల కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన (Yennam Srinivas Reddy) మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 45 రోజులకు ఒకసారి మండల స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అన్నారు. మండలం నుంచి ఐదుగురు విద్యార్థులు ఐఐఐటీలో సీట్లు సాధించినట్లు ఎంఈఓ సమావేశంలో వెల్లడించారు.
దీనిపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేస్తూ.. ఐఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులను తదుపరి మండల స్థాయి సమీక్షా సమావేశానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వారిని ఘనంగా సన్మానించి ప్రోత్సహిస్తామని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారి విజయాన్ని ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిపినట్లవుతుందని, అదే సమయంలో ఇతర గ్రామాల సర్పంచులకు కూడా విద్యార్థుల విద్యాభివృద్ధిపై అవగాహన కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు.
ఎల్‌నినో (El Nino) ప్రభావంతో మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ఎలాంటి భవనాల నిర్మాణంలోనూ జాప్యం చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు.
భూమి లేదనే కారణంతో భవనాల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయకుండా, గ్రామ కంఠంలోని ప్రభుత్వ భూమిని అవసరమైన భవనాల నిర్మాణానికి కేటాయించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణంలో కూడా అలసత్వం వీడాలని అన్నారు. పాఠశాలల్లో పిల్లలకు అవసరమైన టాయిలెట్లను నిర్మించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. మండలంలో లో-వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సేకరించిన భూమిని విద్యుత్ శాఖకు అప్పగించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, ఆయన సర్పంచులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, ఎంపీడీఓ కరుణశ్రీ, తహశీల్దార్ శ్రీనివాసులు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : సొంతపార్టీ నాయకులపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం
Follow Us On: X(Twitter)

