కలం, వరంగల్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలిటెక్నిక్ విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి విద్యార్థులకు త్వరగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం మంచిదే, అయినప్పటికీ దాని కోసం పాలిటెక్నిక్ విద్యా (Polytechnic Education) స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
పాలిటెక్నిక్ విద్యను జీవో 97 ద్వారా లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని కడియం శ్రీహరి (Kadiyam Srihari) తెలిపారు. దీంతో పాలిటెక్నిక్ విద్య వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉన్న జీవో 97ను ప్రభుత్వం పునఃసమీక్షించి రద్దు చేయాలని ఆయన కోరారు. పాలిటెక్నిక్ విద్యను ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థ పరిధిలోనే కొనసాగించడం విద్యార్థుల భవిష్యత్ మేలు చేస్తుందని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్ ఎడ్యుకేషన్ లోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంతకుముందు స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసిన కడియం శ్రీహరి.. వచ్చే ఆరు నెలల్లో దేవాదుల పనులను పూర్తిచేసి నియోజకవర్గంలోని పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని విమర్శించారు. ధరణి, కాళేశ్వరం తదితర అంశాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ప్రజలకు అన్నీ తెలుసునని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న కడియం శ్రీహరి జీవో 97ను రద్దు చేయాలని కోరడం రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి కడియం వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97ని వెనక్కి తీసుకుంటుందా? లేదంటే ఆయన వ్యవహార శైలిపై వేరే ఇతర యాక్షన్ తీసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : పేటలో “బీజేపీ” వర్గ పోరు.. వేడెక్కిన పొలిటికల్ హీట్
Follow Us On: Instagram

