కలం, నారాయణ పేట: జిల్లా కేంద్రంలో బీజేపీ (Narayanpet BJP) వర్గ పోరు రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా రెండు వర్గాల మధ్య గ్రూపు రాజకీయాలు బగ్గుమంటున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత రెండు గ్రూపుల మధ్య కాక రేగుతోంది. ఓ వర్గం మరో వర్గాన్ని టార్గెట్ చేస్తున్నడంతో పార్టీ అధిష్టానానికి విషయం తెలిసినా… మౌనం ఎందుకు? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత గ్రూపు రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాబోయే రోజుల్లో ఇదేవిధంగా గ్రూపు రాజకీయాలు కొనసాగితే ఓ వర్గం నుంచి నారాయణపేటలో బలంగా ఉన్న బీజేపీకి బలహీనత తప్పే అవకాశం లేకపోలేదు.
మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత మరింత వేడెక్కిన హీట్
నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రూపు రాజకీయం మరింత వేడెక్కింది. మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోగా అష్ట కష్టాలు పడి ఓ పార్టీ చెందిన కౌన్సిలర్ల పరోక్ష మద్దతుతో బిజెపి మున్సిపాలిటీ పీఠం కైవాసం చేసుకుంది. ఈ సమయంలో బిజెపి అంతర్గత కౌన్సిలర్లలో పలువురు చైర్మన్ పీఠాన్ని ఆశించారు. చివరకు పార్టీ సీనియర్ నేత మరో వర్గానికి పరోక్షంగా మద్దతు తెలపడంతో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్టయింది. చైర్మన్ అభ్యర్థుల కు మధ్య రోజురోజుకు గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. బహిరంగంగా ఒకరినొకరు పలకరించుకున్న అంతర్గతంగా మాత్రం అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తోంది.
అధిష్టానానికి చేరిన పంచాయతీ..
తాజాగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని వార్డు అంతర్గత రహదారిలో మట్టి వేసే విషయంపై బీజేపీ జిల్లా (Narayanpet BJP) అధ్యక్షులు సత్య యాదవ్ ఏబీవీపీ నాయకుడు చరణ్ రెడ్డికి మధ్య మున్సిపాలిటీ ఆవరణలోనే ఘర్షణ జరిగింది. నువ్వెంత అంటే నేనంతా అనేటట్టుగా ఫోన్లో దుర్భాషలాడుకున్నారు. చివరకు పోలీస్ స్టేషన్లో ఇరువురు ఫిర్యాదు చేయగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.
పేటకు రానున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఈనెల 31న నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలోని ఓ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడి ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం ఉంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ డీకే అరుణను ఆహ్వానించారు. బీజేపీలో జరుగుతున్న అంతర్గత వర్గ పోరు అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణలు జోక్యం చేసుకొని పరిస్థితిని సద్దుమణిగిస్తారా లేక మాకు ఎందుకులే అని స్థానిక నాయకులకే వదిలేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఆ సీసీ రోడ్డు గొడవకు దారితీసిందా?
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యసాయి కాలనీ సమీపంలో స్థానిక బీజేపీలోని ఓ సీనియర్ నాయకునికి చెందిన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఈ నెల 31న ఉంది. ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ఎలాంటి మున్సిపాలిటీ టెండర్ లేకుండానే రూ.30 లక్షలకు పైగా బడ్జెట్ తో తన సొంత ప్రోద్బలంతో సీసీ రోడ్డు వేయించుకున్నాడు. సీసీ రోడ్డు వేసిన వ్యక్తి కూడా మున్సిపల్ కౌన్సిల్ లో ప్రముఖమైన హోదాలో ఉన్న భర్త కాంట్రాక్టర్ కావడం విశేషం. ఈ సీసీ రోడ్డు అంశమే రెండు వర్గాలకు మధ్య బగ్గుమనే పరిస్థితి తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. ఇదంతా చూస్తే ఓ సామాజిక వర్గం మరో సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వర్గ పోరుకు దారి తీసినట్లు తెలుస్తోంది.
Also Read : కాంగ్రెస్కు కడియం శ్రీహరి షాక్.. సంచలన డిమాండ్..!
Follow Us On : WhatsApp

