గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా హైదరాబాద్: కపిల్ దేవ్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ గోల్ఫ్ టూరిజం హబ్‌ (Golf Tourism Hub)గా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని టీమిండియా మాజీ కెప్టెన్, డీపీ వరల్డ్‌ పీజీటీఐ అధ్యక్షుడు కపిల్‌ దేవ్‌ (Kapil Dev) అన్నారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ 12వ ఎడిషన్‌ సందర్భంగా శనివారం గోల్కొండలోని హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. దీనికి పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కపిల్ దేవ్ హాజరయ్యారు. డీపీ వరల్డ్‌ ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (డీపీ వరల్డ్‌ పీజీటీఐ), హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి ఈవెంట్‌ పార్ట్‌నర్‌గా తెలంగాణ టూరిజం శాఖ వ్యవహరిస్తోంది.

కపిల్‌ సేవలు వినియోగించుకుంటాం..

తెలంగాణలో పర్యాటకం, క్రీడల ప్రచారానికి కపిల్‌ దేవ్‌ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మంత్రి జూపల్లి (Minister Jupally) తెలిపారు. ఆటల్లో ఆయన అనుభవం, అంతర్జాతీయ గుర్తింపు రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పారు. తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్‌ టూరిజం కేంద్రంగా (Golf Tourism Hub) తీర్చిదిద్దడంలో భాగంగా శామీర్‌పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో గోల్ఫ్‌ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా గోల్ఫ్‌ క్రీడాకారులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

సోమశిలలో మరో గోల్ఫ్ కోర్సు..

కృష్ణానది తీరంలోని నల్లమల అడవులు, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్ ప‌ర్యాట‌క క్ల‌స్ట‌ర్ సోమశిలలో మరో ప్రపంచ స్థాయి గోల్ఫ్‌ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. గోల్ఫ్‌ టూరిజం మౌలిక వసతుల అభివృద్ధిలో పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ కేవలం క్రీడా పోటీ మాత్రమే కాదని.. అంతర్జాతీయ గోల్ఫ్‌ను తెలంగాణ పర్యాటక, వారసత్వ సంపదతో అనుసంధానించే వేదిక అని జూపల్లి అన్నారు.

విజేతకు రూ.కోటి ప్రైజ్ మనీ..

హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ కెప్టెన్‌ జస్వీందర్ సింగ్‌ బిర్గి (Jaswinder Singh Birgi) మాట్లాడుతూ.. సెప్టెంబరు ఒకటో తేదీ జరిగే గోల్ఫ్ పోటీలకు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌కు ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ గోల్ఫర్ల ఆటను హెచ్‌జీఏ సభ్యులు వీక్షించే అవకాశం లభిస్తుందని తెలిపారు. లైవ్‌ టెలికాస్ట్‌ ద్వారా హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం అవుతుందన్నారు. సెప్టెంబర్ నాలుగో తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో 132 మంది గోల్ఫ్‌ క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. విజేతకు రూ.కోటి ప్రైజ్‌మనీ అందుతుందన్నారు. టోర్నీకి అధికారిక ప్రపంచ గోల్ఫ్‌ ర్యాంకింగ్‌ (OWGR) పాయింట్లు లభించనున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీపీ వరల్డ్‌ పీజీటీఐ సీఈవో అమన్‌దీప్‌ జోల్‌, చెక్‌ రిపబ్లిక్‌ గోల్ఫర్‌ స్టెపాన్‌ డానెక్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : నీరజ్ చోప్రా 2026 సీజన్ ముగింపు.. ఆసియా గేమ్స్‌కు దూరం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>