కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం (Peddamma Temple)లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన కారుకు పూజ చేయించేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఒక వ్యక్తి, అదే కారు కింద పడి దుర్మరణం చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తన మేనల్లుడు సాయికుమార్ కొత్తగా కొనుగోలు చేసిన వాహనానికి పూజ జరిపించేందుకు రామచంద్రరావు (70) పెద్దమ్మ గుడికి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో పూజారి ద్వారా వాహన పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. అనంతర ప్రక్రియలో భాగంగా కారును ముందుకు జరిపే క్రమంలో అకస్మాత్తుగా అదుపు తప్పి ప్రమాదం జరిగింది.
పూజ పూర్తయిన వెంటనే డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికుమార్ ప్రమాదవశాత్తు బ్రేక్‌కు బదులు యాక్సిలేటర్‌పై కాలు వేయడంతో కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఊహించని పరిణామంతో కారు దగ్గర నిలబడి ఉన్న రామచంద్రరావు వాహనం కింద పడిపోయారు. కారు ఆయనపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ తదుపరి విచారణ వేగవంతం చేశారు.

