కలం డెస్క్ : రాష్ట్ర సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన ‘హిల్ట్’ (HILT Policy) ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనేది మంత్రుల అభిప్రాయం. క్యాబినెట్ ఆమోదం వచ్చి 40 రోజులు దాటినా పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు రాలేదని ఓ మంత్రి తాజాగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి చిన్న, మధ్యతరహా పరిశ్రమల, సిక్ ఇండస్ట్రీస్ యజమానులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తుల మేరకే ఈ పాలసీ తెచ్చామని గుర్తుచేశారు. కానీ వారి నుంచి కూడా ఇప్పుడు స్పందన లేకపోవడంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత దీనిపై ప్రభుత్వం సమీక్షించి ఇండస్ట్రియలిస్టులను పిలిచి మాట్లాడుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్ణయించిన టారిఫ్ నచ్చలేదా?.. మరింకేదైనా కారణం ఉన్నదా?.. వీటిపై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత పాలసీ అమలుపై నిర్దిష్ట యాక్షన్ ప్లాన్ రూపొందుతుందన్న సంకేతాలిచ్చారు.
HILT Policy రిలీజ్‌కంటే ముందే వివాదం :
హిల్ట్ పాలసీ అధికారికంగా రిలీజ్ కాకముందే వివాదాస్పదమైంది. ప్రతిపక్షానికి ముందుగా లీక్ కావడంపై ముఖ్యమంత్రే విస్మయం వ్యక్తం చేశారు. అధికారులనే అనుమానించాల్సి వచ్చింది. చివరకు దానిపై ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఔటర్ రింగు రోడ్డు లోపలి పరిశ్రమలను బైటకు తరలించడంపై మంత్రివర్గం చర్చించి నిర్దిష్ట గైడ్‌లైన్స్ విడుదల చేసింది. గతంలో పరిశ్రమలకు కేటాయించిన సిటీలోని పారిశ్రామికవాడల్లోని భూములను ఇతర అవసరాలకు వినియోగించుని పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించేలా ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించింది ప్రభుత్వం. ఖజానాకు ఆదాయం వస్తుందని, కాలుష్యాన్ని నివారించవచ్చని భావించింది. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరంగా ఉండేలా టారిఫ్‌ను ఫిక్స్ చేసింది. అయినా స్పందన ఆశించినంతగా రాలేదు.
పారిశ్రామికవేత్తల్లోనూ అసంతప్తి :
ప్రభుత్వం ఆశించినదానికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉండడం చర్చకు దారితీసింది. పాలసీని అమలు చేయలేక, వెనక్కి తీసుకోలేక ప్రభుత్వం గందరగోళంలో పడింది. పారిశ్రామికవేత్తలు పాజిటివ్‌గా స్పందిస్తారనుకున్న అంచనా తలకిందులైంది. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సంఘం ప్రతినిధులు ఇటీవల మీడియా సమావేశంలో ‘స్వచ్ఛందం’ పేరుతో పరిశ్రమలను ‘నిర్బంధం’గా ఓఆర్‌ఆర్ బైటకు తరలించే జీవోను తప్పుపట్టారు. దాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ సైతం ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నది. ఇన్ని వివాదాల నడుమ ‘హిల్ట్’ పాలసీ అమలు ప్రశ్నార్ధకంగా మారింది. పరిశ్రమలను తరలిస్తే పునరావాసం, పరిహారం, ఓఆర్‌ఆర్ బైట ప్రత్యేక పారిశ్రామికవాడల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల్లో స్పష్టత లేకపోవడమే ఈ అనిశ్చితికి, స్తబ్ధతకు ప్రధాన కారణమన్నది పారిశ్రామికవేత్తల అభిప్రాయం.
పరిశ్రమల తరలింపులో ఇబ్బందులు :
ప్రస్తుతం సిటీలో ఉన్న పరిశ్రమలను తరలించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనేది పారిశ్రామికవేత్తల వాదన. ఆర్థిక వనరులపై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ ఎలాంటి కసరత్తు చేయకుండానే నివేదిక రూపొందించిందని, టీజీఐఐసీ సైతం దాని ఆధారంగా ముసాయిదా పాలసీని రూపొందించి క్యాబినెట్‌కు పంపిందన్న విమర్శలున్నాయి. పాలసీపై మంత్రివర్గ సమావేశంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. అయినా వాటిని బేఖాతరు చేస్తూ ఓ ముఖ్య నేత ప్రమేయంతో ఆమోదం తెలపడం, ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం వివాదాలకు తావిచ్చింది. చివరకు అఫీషియల్‌గా పాలసీ రిలీజ్ కావడానికి ఒకరోజు ముందే ఆ కాపీ ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లడం అనేక సందేహాలకు తావిచ్చింది. క్యాబినెట్‌లో భిన్నాభిప్రాయం వ్యక్తమైనా ప్రభుత్వం తాననుకున్న నిర్ణయం తీసుకున్నందునే లీక్ అయిందనే అనుమానాలు తలెత్తాయి. మంత్రులు, అధికారులనూ అనుమానించే వాతావరణానికి దారితీసింది.
పునరాలోచనలో రాష్ట్ర సర్కార్ ? :
చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు సిక్ ఇండస్ట్రీస్ యజమానులతో అసెంబ్లీ సమావేశాల తరవాత ఒక మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వారి అనుమానాలను నివృత్తి చేయాలనుకుంటున్నది. ఏదో ఒక రూపంలో వారికి నచ్చజెప్పి సంతృప్తిపర్చాలన్నది సర్కారు ఉద్దేశం. వాళ్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే మరిన్ని రాయితీలు ఇచ్చి పాలసీని ఎలాగైనా అమలు చేయాలన్నది ప్రభుత్వ భావన. ఈ పాలసీ అమల్లోకి వస్తే ఐదారు వేల కోట్ల మేర ఖజానాకు ఆదాయం సమకూరుతుందని అనుకుంటున్నది. కమర్షియల్ అవసరాల కోసం ల్యాండ్ కన్వర్షన్ చేయడం ద్వారా భూముల ధరలు కూడా పెరుగుతాయని ఆలోచిస్తున్నది. హిల్ట్ పాలసీ కోర్టు పరిధిలోకి కూడా వెళ్ళినందున అమలుపై నీలి నీడలు నెలకొన్నాయి. అమలవుతుందా?.. లేక కోల్డ్ స్టోరేజీలోకి వెళ్తుందా?.. అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో మొదలైంది.
Read Also: 90% పనులు పచ్చి అబద్ధం.. పీపీటీలో సర్కార్ సంచలనం
Follow Us On: Pinterest


